సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, October 25, 2014

శని త్రయోదశి



శని త్రయోదశి. రోజు శనిదేవుని స్మరించినా, అర్చించినా, శివపూజ చేసినా శనిదోషాలు నశిస్తాయి. రుద్రాభిషేకం వంటివి ఈరోజున విశేషఫలాన్నిస్తాయి. ప్రతి శనివారం సంవత్సరం పాటు ఈక్రింది నామాలను, స్తోత్రాన్ని పఠిస్తే శనిబాధలు ఉండవు.

కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగలాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే!!
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో!!
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమదేవేశ దీనస్య ప్రణతస్యచ!!

విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శనిదేవతనే! సాధారణంగా శనిదేవతపై అనేకమందిలో చాలా రకాలైన అపోహలున్నాయి. శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కిపడతాం. నామాన్ని ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని తీర్మానించుకుంటాం. శనీశ్వరుడిని ఆహ్వానించినట్టవుతుందని తైల పదార్థాలు వేటినీ చేతులతో అందుకోం. ఆయన దృష్టి మనపైకి సోకరాదని పదే పదే కోరుకుంటాం. కొన్ని ప్రాంతాలవారైతే శనివారంనాడు తిలా సంబంధిత వస్తువులేవీ కొనరు, తినరు. అంత :భయం ఆయనంటే. శనీశ్వరుడు కేవలం క్రూరత్వానికి, పీడించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు.

నవ గ్రహాలలో ఒకడైన శనిని మనం భక్తీ పూర్వకంగా ఆరాధిస్తాము. సూర్యునికి, చాయకు పుట్టిన కుమారుడు శని. యముడు, యమునలకు అన్నగారు. యముడు, శని ఇద్దరూ కుడా జీవుల పాప పుణ్యాల ఫలితాలను ఇచ్చేవారే. యముడు జీవి చనిపోయిన తరువాత శిక్షిస్తే, శని జీవుడు బ్రతికి ఉండగానే పాపకర్మలకు తగిన శిక్ష ని వేస్తాడు. ఏలినాటి శని,  అర్దాష్తమ శని, అష్టమ శని రూపంలో ఈ శిక్షలు ఉంటాయి.  శని సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంత నెమ్మదిగా తిరుగుతుంది. అందుకనే ఈయనకు మంద గమనుడు అని ఇంకొక పేరు. ఈయన నల్లటి దేహం కలవాడు, నల్లని వస్త్రాలు ధరించిన వాడు, కాకి వాహనంగా కలవాడు. ఈయనకు నలుపు రంగు, నువ్వులు, అశుభ్రత, మందకొడి తనం.అంటే ప్రీతి.  అందుకే అశుభ్రం గ లేదా మందకొడిగా ఉన్నవాళ్ళ దగ్గర శని దేవుడు హాజరు అవుతాడు. కానీ నల్లటి వస్త్రం, నువ్వులు, నువ్వుల నునె సమర్పించిన వాళ్ళని అనుగ్రహిస్తాడు అంటారు.

సృష్టి, స్థితి, లయ కారకులు త్రిమూర్తులు. మనం చేసిన కర్మల ఫలితాలనివ్వడానికి భగవంతుడే గ్రహాల రూపంలో అవతరించాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత మూల పురుషుడు. సూర్యుడు, చంద్రుడు, మార్స్‌, మెర్క్యురి, బృహస్పతి, వీనస్‌, శని గ్రహాలకు వరుసగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, బుద్ధుడు, వామనుడు, పరశురాముడు, కూర్మావతార విష్ణువు, వరాహస్వామి, మత్స్యావతార స్వామి ఆవహించి ఉన్నారు. అందువల్ల గ్రహాలు దైవాంశసంభూతులని అర్థంచేసుకోవాలి. గ్రహకూటములు రాజ్యాలను కూల్చడానికే కాక మొత్తం ప్రపంచం ఉనికికే మూలం.

ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకున్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు. ఎంత దైవాంశసంభూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపూ సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించండి. నిజాయితీగా జీవించండి.

భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వరప్రదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు.

ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదించాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాలనుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.

ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవటానికి  మార్గాలు:-
1. ప్రతి శనివారము తలకు, ఒంటికి నువ్వుల నునె రాసుకుని స్నానం చేస్తే శని శాంతిస్తాడు.
2. శనివారం నాడు శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా మంచిదే.
3. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి, నల్ల నువ్వులు, నునె, మినుములు దానం చేస్తే మంచిది.
4. దశరధ ప్రోక్త శని స్తోత్రం పఠించి, రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసి, ఒంటిపూట భోజనం చేయడం వలన శనిని శాంత పరచ వచ్చు.
5. శనివారం నాడు 8 మంది భిక్షకులకు, వికలాంగులకు సహాయం చేయడం, వస్త్రదానం చేయడం వలన శని దోషనివారణ జరుగుతుంది.
6. హనుమాన్ చాలిసా, దుర్గ స్తోత్రం, రామనామం జపించాలి.
7. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి. కాళీ పూజ చేయాలి.

                                       !!నీలాంజన సమాభాసం, రావిపుత్రం యమాగ్రజమ్,
                                               చాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం!!

No comments:

Post a Comment