ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను,
ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు
యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.
కేశవుడు నా రోమాలను రక్షించుగాక.
చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా
జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను,
భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.
విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున,
ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.
"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు,
జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.
దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"
"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ,
సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."
"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ,
కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ,
తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."
"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే
అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే
సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."
"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా,
అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."
"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట
కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."
"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."
అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి,
చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.