సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, July 19, 2016

గురు(వ్యాస)పూర్ణిమ

గురు(వ్యాస)పూర్ణిమ

వ్యా సుడి విజ్ఞానం ఎవరినైనా సంభ్రమాశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. అవి విడదీయడానికి సాధ్యం కానట్లుగా కలిసిపోయాయి. వ్యాసుడు ఆ వేదాలను విభజించి, తిరిగి మనకు ప్రసాదించాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త.
భారత ఇతిహాసాన్ని రచించిన వ్యాసుడు, మన ప్రాచీన పవిత్ర గాథలకు మూలమైన పద్దెనిమిది పురాణాలను వెలువరించాడు. ఇవన్నీ చేయడం మానవమాత్రుడికి సాధ్యమా? అందుకే భక్తులు ఆయనను మహావిష్ణువుగా భావిస్తారు.
జగద్గురువుల్లో ప్రథముడు వ్యాసుడే. వ్యాస పూజ అంటే వేద పూజ, ఈశ్వర పూజ! దైవానుగ్రహం కావాలంటే, గురువు ఆశీస్సు లభించాలి. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి, వెలుగు చూపినవాడే గురువు.

ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించిన జ్ఞాన సంపన్నులను గురువులుగా పరిగణించి, శిష్యులు వారికి పూజ చేస్తారు. వ్యాస పూర్ణిమనాడు మనం పూజించే 'వ్యాసుడు' ఫలానా వ్యక్తి అని ఒక్కర్ని గురించి చెప్పే 'పదం' కాదు. అది 'పదవి'! అది సకల కళానిధి, మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడి పరంపరలో వచ్చిన, వస్తున్న, రానున్న గురువులందరికీ చెందుతుంది. అందువల్ల వ్యాసపూర్ణిమనాడు ఎవరి గురువులను వారు ఆరాధించుకోవచ్చు. కలియుగంలో ఈ పండుగను పాటించే సంప్రదాయాన్ని ఆ55దిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతారు.
ఒకప్పుడు యతీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు పాటించిన ఈ పర్వదినం, ఇప్పుడు జన సామాన్యంలోకి వచ్చింది. నేపాలులో ఇది ముఖ్యమైన పండుగ. మన దేశంలోనూ అనేక విద్యాలయాల్లో గురుపూజ, వ్యాసపూజ జరుగుతాయి. శంకర పీఠాల్లో గురుపూర్ణిమ భక్తి ప్రపత్తులతో జరుగుతుంది.
ప్రస్తుతం 28వ మహాయుగంలోని కలియుగంలో జీవిస్తున్నాం. ప్రతి మహాయుగంలోనూ మహావిష్ణువు 'వ్యాసుడు'గా అవతరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మొదటి వ్యాసుడు స్వాయంభువుడు; 27వ వ్యాసుడు జాతూకర్ణుడు. ఇప్పటి వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు.
మానవజాతికి మహోపదేశం చేసేవి వేదాలు. సోమరితనం పాపమని, కృషిచేసేవాడికే దైవం తోడ్పడతాడని, శ్రమలోనే సంపద ఉన్నదని, ఉత్సాహవంతుడికి విద్య లభిస్తుందని, మనసు ఎప్పుడూ శుభాన్ని కోరాలని, అన్ని ప్రాణుల్నీ స్నేహబుద్ధితో చూడాలని... వేదం పలుకుతున్నది. ధార్మిక సేవకు వేదం మూలమని మనుస్మృతి పేర్కొంది. ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికీ మనకు లభిస్తుండటానికి కారకుడు వ్యాసుడు!
మన పవిత్ర పారాయణ గ్రంథం భగవద్గీత. తిలక్‌, గాంధీలను కర్తవ్య దీక్షాదక్షుల్ని చేసిన భగవద్గీత మహాభారతంలోది. వేదసారాన్ని పిండి 'పంచమవేద'మైన మహాభారతాన్ని అందించిన మహర్షి- వేదవ్యాసుడు. కొత్త పురాణం రచించినవారిని 'వ్యాసుడు' అనడం రివాజు. వేదబోధను సామాన్యుల వద్దకు చేర్చడానికి భారతాన్ని రచించి, మళ్ళీ భారత ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా ఆయన సరళ సుందరంగా సంక్షిప్తీకరించాడు. శంకరాచార్యుల భాష్యంతో భగవద్గీతా జ్ఞానం అందరికీ మరింత చేరువ అయింది.
సత్యవతీ పరాశరుల పుత్రుడైన వ్యాసుడు భారతాన్ని రచించడమే కాదు, ఆ మహేతిహాసంలో తానూ ఒక పాత్రగా పలు పర్యాయాలు దర్శనమిస్తాడు. భారత రచనతో సంతృప్తి చెందని వ్యాసుడు, భాగవతాన్నీ రచించి ధన్యుడయ్యాడు.
వేదం ప్రభువులా శాసించి చెబుతుంది. పురాణం మిత్రుడిలా కథారూపంలో ప్రబోధిస్తుంది. ఇటువంటి భారతీయ సాంస్కృతిక మూలస్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ వందనీయుడయ్యాడు. ఆయన జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ ఆద్యుడైన వ్యాసుడి పుట్టినరోజు పండుగను గురుపూజోత్సవంగా, కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమా వ్రతంగా ఆచరిస్తారు. శివభక్తులు శివ శయన వ్రతాన్ని పాటిస్తారు. ఆధ్యాత్మికవేత్తలకే పరిమితమైన 'వ్యాసపూర్ణిమ' నేడు సర్వజన హృదయాహ్లాదకరమైన 'గురుపౌర్ణమి'గా వ్యాప్తి చెందడం శుభ పరిణామం!

గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో ...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం "వారణాశి" లో కదుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాదు, ఒకరోజునదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్సిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూత్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న 'వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులులతో వారిని పూజిస్తారు.అనంతరం వారి దేవతార్చనకు 'సాలగ్రామమూ, 'తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా1 మీకు ఎమి వరకావాలో కోరుకోండి. నోమూలూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలాను అనుభవిస్తూ; అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని 'వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు.

"శృణు విప్రతవేచ్చా చేత్ దర్శనార్థం తదాత్వయా
పూఅజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం"
అని అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.

అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విస్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వార్మి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్దపాద్యమి"నాడు వార్కి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము గమనిస్తున్నాము గదా!'-మరి. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."
ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుకాగురువారమూ అయిన ఎడలాది మరింతగా స్రేష్ఠమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్నమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః!!

Thursday, July 14, 2016

తొలి ఏకాదశి విశిష్టత.

తొలి ఏకాదశి విశిష్టత..!!

శ్రీ మహా విష్ణువు నిద్రావస్తలోకి వెళ్లే తొలి ఏకాదశి విశిష్టత..!! ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి. దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్య మాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే 'విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక' మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.

గణపతికి ఏకదంతమే ఎందుకుంటుంది?

గణపతికి ఏకదంతమే ఎందుకుంటుంది?

విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు అందుకనే ఆయనకు మనం తొలిపూజ చేసిన అనంతరమే శుభకార్యాలను ప్రారంభిస్తాం. గణనాధుడికి ఏకదంతమే వుండటం విశేషం. అందుకే స్వామిని ఏకదంతాయ నమః అని పూజిస్తాం. ఆ జగన్మాత పార్వతీదేవి తనయుడైన వినాయకునికి ఏకదంతుడు అని పేరు రావడం వెనుక ఒక కథ వుంది. బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండంలో స్వామికి ఏకదంతం ఎలా ఏర్పడింది అన్న అంశంపై వివరాలున్నాయి. ఒకసారి పరశురాముడు ఆదిదంపతుల దర్శనార్థం కైలాసానికి వస్తాడు. అయితే వారు ఏకాంతంలో వున్నారని భంగం కలిగించకూడదని వినాయకుడు అతనిని వారిస్తాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగుతుంది. గణేశుడు ఎంత సౌమ్యంగా చెప్పినప్పటికీ పరశురాముడు గండ్రగొడ్డలిని విసరబోయే యత్నం చేస్తాడు.

ఇంతలో కార్తికేయుడు ప్రవేశించి గురుపుత్రుడిపై ఆగ్రహం వ్యక్తంచేయడం సబబుకాదని హితవు పలికాడు. అయినా పరశురాముడు గొడ్డలి విసిరేందుకు సిద్ధమవుతాడు. దీంతో వినాయకుడు తన తొండాన్ని కొన్ని వందల యోజనాలు పెంచి పరశురాముడిని పట్టుకొని గిరగిరా తిప్పాడు. ఒకసారి ఎత్తుకొని పద్నాలుగు లోకాలను చూపిస్తూ తొండంతో తిప్పాడు.

దీంతో భార్గవరాముడు భీతిచెందాడు. అనంతరం సముద్రాల నీటిని తొండంతో పీల్చివేసిన గణపతి ఒక్కసారిగా అన్నింటిని వెదజల్లి పరశురాముడిని అందులోకి విసిరివేశాడు. సాగరంలో పడ్డ జమదగ్ని పుత్రుడు వెంటనే ఈదుకుంటూ బయటకు వచ్చి పట్టరాని ఆగ్రహంతో గొడ్డలిని విసిరాడు. ఆ పరశువు వేగంగా వెళ్లి వినాయకుడి ఒక దంతాన్ని నరికి తిరిగి అతన్ని చేరుకుంది.

ఈ గొడవకు పరమేశ్వరుడు, పార్వతీలు బయటకు వచ్చారు. తన ముద్దుల తనయుడికి ఒక దంతం లేకపోవడం గమనించిన జగన్మాత ఏం జరిగిందని మురుగన్‌ను అడుగుతుంది. అతను మొత్తం సంఘటనా వివరాలను తెలపడంతో అమ్మ ఉగ్రరూపం దాల్చి పరశురాముడిని శపించేందుకు సిద్ధమవుతుంది. పరశురాముడు తనను క్షమించమని అమ్మను వేడుకోవడంతో ఆమె శాంతిస్తుంది.

అతను కూడా తన తనయుడి లాంటి వాడే కాబట్టి జగన్మాత అతన్ని క్షమించింది. ఒక దంతం అలా పోవడంతో స్వామి ఏకదంతుడిగా పేరుపొందారు. నిత్యం పూజలందుకుంటూ యావత్‌ విశ్వాన్ని పరిరక్షిస్తున్నారు.

పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?

పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్‌ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్‌ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి.

అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్‌కు వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు.

ఆంజనేయ స్వామి అవతారాలెన్నో తెలుసా..?
ఆంజనేయ స్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయ స్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు. అవేంటంటే..
1. ప్రసన్నాంజనేయ స్వామి
2. వీరాంజనేయ స్వామి
3. వింశతి భుజ ఆంజనేయ స్వామి
4. పంచముఖ ఆంజనేయ స్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయ స్వామి
6. సువర్చలాంజనేయ స్వామి
7. చతుర్బుజ ఆంజనేయ స్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయ స్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు.

పంచముఖ ఆంజనేయ స్వామి
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి:

1. తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

Monday, July 11, 2016

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). 
http://tvramudu.blogspot.in

ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మేరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిల్ఫ్ ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేశి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ధానానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి స్మార్పించు" అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.
మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహoకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహoకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా..

గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ

గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ

ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును.

ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.

కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం.

గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.

శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు.

ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలనీ ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును, ‘గోమాత’ అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవనసరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి.

పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. గోవుకు వేదప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమంవలన గోవు జన్మించుటచేత గోవునకు అగ్ని హోత్రమని పేరు వచ్చింది. మన వేదాలలో ‘గో’ మహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలనేకం ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అధర్వణ వేదం కీర్తించగా, ఋగ్వేదం ‘గవా తుల్యం నోపశ్యామినృణే త్వామ్’ అని పలుకగా, నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది. ఆవులో దేవతా శక్తులున్నాయని, అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్నచోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన, గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండప్రదానం చేయలేని వారికి పిండప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి.

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘‘నాథా! జనులు పాపము నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును, తరుణోపాయమును తెలుపమ’’ని అడగగా - శివుడు పార్వతీదేవితో ‘‘గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదములందు పితృ దేవతలు, కాళ్ళయందు సమస్త పర్వతాలు, దంతములందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జేష్ఠాదేవి, కళ్ళయందు - సూర్యచంద్రాదులు, చెవులయందు శంఖచక్రాలు, కంఠమున విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, వెన్నునందు వరుణ దేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమావళి యందు త్రిశంకకోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యములను, అష్టైశ్వర్యములను పొందవచ్చునని, గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని, గోమాతను నమస్కరించి ప్రదిక్షణం చేస్తే భూమండలమంతా ప్రదిక్షణం చేసినంత ఫలము కలుగుతుందని’ చెప్పాడు. భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవులకన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని, ఆవునేతిని నిప్పుమీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞయాగాదులవల్ల తెలుస్తోంది. అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్లు తెలిసికొన్నారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది. అన్నివిధాలా ఆవు మనకు మేలే చేస్తోంది. బ్రతికీ, మరణించీ కూడా ఉపకారమే చేస్తోంది. కనుక గోవులను సంరక్షించుకుందాం!

Thursday, July 7, 2016

పరమేశ్వరుని సృష్టి



యావత్‌ విశ్వంలో సాక్షాత్తూ పరమేశ్వరుని సృష్టిగా వారణాసిని పేర్కొంటారు. ఆ లయకారకుడైన శివుడే ఈ నగరాన్ని నెలకొల్పినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాశీ క్షేత్రంలో జనజీవితం విరాజిల్లుతోంది. పగలు, రాత్రి అని తేడా లేదు నిత్యం వేలాదిమంది యాత్రికులతో సందడిగా వుంటుందీ ఈ దివ్యక్షేత్రం. ద్వాదాశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథక్షేత్రంగా, విశాలాక్షి వెలసిన పవిత్రభూమిగా, అన్నపూర్ణ నేలగా ఈ క్షేత్రం పేరుపొందింది. కాశీ అంటే పవిత్రక్షేత్రం. ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. వేల ఆలయాలు, గంగా హారతి కార్యక్రమం, నిత్య పూజలు, భజనలు, అర్చనలు, భక్తుల రాకపోకలతో ఎప్పుడూ ఆధ్యాత్మికంగా గుబాళిస్తువుంటుంది.
అందుకనే కాశీయాత్ర గురించి మన పూర్వీకులు కథలు కథలుగా చెబుతుంటారు. కాశీమజిలీ కథలు కూడా ఈ యాత్రావిశేషాలను వెల్లడిస్తూ రాసినవే. 'కాశ్యాన్తు మరణాన్‌ ముక్తి' కాశీలో కన్నుమూస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కాశీ విశ్వనాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశిష్టమైనదిగా కాశీ విశ్వనాథుడిని పేర్కొంటారు. పవిత్ర గంగానదీ తీరాన వున్న ఈ మందిరంలో స్వామిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆలయం పలు దండయాత్రల్లో శిథిలమయింది. 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాభాయి హోల్కార్‌ ఆలయాన్ని పునరుద్ధరించారు. రుగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కందపురాణంలోని కాశీఖండంలో ఈ ఆలయం గురించిన వివరాలున్నాయి. గంగా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచిది. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాశీ విశ్వనాథుని మందిర నమూనాలో దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కూడా వీక్షించాలి.

కాశీ విశాలాక్షి
ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిసారు. సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రమిది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికి ఈ క్షేత్రం ఆరాధ్యనిలయం. ఆ ఆదిదంపతులు స్వయంగా వెలసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి.
అన్నపూర్ణ ఆలయం
సకల ప్రాణకోటికి చోదకశక్తి ఆహారం. ఆహారాన్ని ఆ లోకమాతేఅందిస్తుంది కనుకే అన్నపూర్ణ మాతగా పిలుస్తారు. ఆమె కరుణా, కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తే అన్నపూర్ణ మాతగా కాశీక్షేత్రంలో వెలిశారు. రామ భక్త హనుమాన్‌ ఆలయం సంకట్‌మోచన్‌ మందిరాన్ని కూడా వీక్షించాలి.
ఆదిశంకరుని రచనలు...
ఆద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరులకు ఈ నగరంతో మంచి అనుబంధముంది. ఆయన ఇక్కడే బ్రహ్మసూత్రాలు, భజగోవిందం ... తదితర గ్రంథాలు రచించారు. రామకృష్ణపరమహంస, కబీర్‌, తులసీదాస్‌, రవిదాస్‌...ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తమ ప్రసంగాల్లో, రచనల్లో విశేషంగా ప్రస్తావించారు.
అంతిమ సంస్కారాలకు నిలయం..
కాశీలో కన్నుమూస్తే శివసాయుజ్యం పొందుతారని ఆర్యోక్తి. దీంతో వయోధికులు అనేకమంది కాశీలోనే తమ అంత్యజీవితాన్ని గడపాలని వస్తుంటారు. గంగాతీరంలో 80కు పైగా ఘాట్లు వున్నాయి. వీటిలో దశాశ్వమేధ్‌ఘాట్‌, మణికర్ణిక ఘాట్‌, హరిశ్చంద్ర ఘాట్‌... ముఖ్యమైనవి. దశాశ్వమేథ్‌ఘాట్‌లో బ్రహ్మదేవుడు పది అశ్వమేధయాగాలను నిర్వహించినట్టు పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘాట్‌లోనే గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. మణికర్ణికఘాట్‌ను మహావిష్ణువే నిర్మించినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఘాట్‌ను నిర్మిస్తుండగా విష్ణువు కుండలం ఇందులో పడిపోయింది. అందుకు అంత పవిత్రమైన ప్రదేశంగా భాసిల్లుతోంది. ఇక్కడ చనిపోయిన వారి చెవిలో మహేశ్వరుడు తారక మంత్రాన్ని చెబుతుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరిశ్చంద్రఘాట్‌లో హరిశ్చంద్రుడే కాటికాపరిగా బాధ్యతలు నిర్వహించడంతో ఆయన పేరు మీద ఘాట్‌కు పేరు వచ్చింది.
అన్ని మతాలకు పవిత్రభూమి..
కాశీ కేవలం హిందువులకే కాదు బౌద్ధం, జైన మతాలకు పవిత్రభూమి. బౌద్దులకు పవిత్రమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. జైన మత 23 తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఇక్కడే జన్మించడంతో జైనులకు పవిత్రక్షేత్రమైంది. కాశీ సమీపంలోని సారనాథ్‌లో బుద్ధుడు తొలి ప్రసంగం చేశారు. మన జాతీయ చిహ్నమైన మూడు సింహాల స్థూపం ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది.
ఎలా చేరుకోవచ్చు
* దేశంలోని అన్ని నగరాలతో ఈ నగరానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
* వారణాసి సమీపంలోని మొగల్‌సరాయ్‌ పెద్ద జంక్షన్‌. నిత్యం అనేక రైళ్లు ఈ రైల్వేస్టేషన్‌ ద్వారా వెళుతుంటాయి.
* వారణాసి విమానాశ్రయాన్ని అన్ని నగరాలతో విమాన సర్వీసులతో అనుసంధానించారు

సర్వం జగన్నాథం

సర్వం జగన్నాథం
ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి.
వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ
జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి
భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత
అపురూపంగా భావిస్తారు భక్తులు.
ఆషాఢ శుద్ధవిదియ... పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది.
జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ
నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం
కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం
అపురూపం. స్వరం జగన్నాథం.
రెండు నెలల ముందే...
జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ
బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072
ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి
అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు.
వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ
వినియోగిస్తారు.
ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల
ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో 'నందిఘోష'ను
అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న
నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న
నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు.
ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.
విదియనాడు...
మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే
'మనిమా(జగన్నాథా)' అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు,
అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా... దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే
బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో
బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి
అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో
సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం
ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ
ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు
విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని
తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు... ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ
జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం... వూరేగింపు
నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
రాజే బంటు...
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా... పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి
నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం
స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ
అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర
మొదలవడమే తరువాయి.
జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి... జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ
తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ(ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది.
లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర
అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు.
అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి
కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా
ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి
తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని
బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు
ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు
భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా
స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.
స్థలపురాణం
ఇంద్రద్యుమ్నుడనే మహారాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా
మలచమనీ ఆజ్ఞాపించాడట. కానీ అలా నదీతీరంలో లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అప్పుడు
దేవశిల్పి విశ్వకర్మ రాజు వద్దకు మారువేషంలో వచ్చి... ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. కానీ తాను తలుపులు
మూసుకుని ఈ పని చేస్తానని తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. కానీ 15 రోజుల తర్వాత... ఉత్సుకతను
ఆపుకోలేని రాజు తలుపులు తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ
జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం.
ఎందుకంటే..?
రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు
బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ
రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన
ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక
మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని
రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం
అన్నమాట!
ఎలా చేరుకోవాలి
ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.
భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

Wednesday, June 29, 2016

నమో.. సూర్యదేవా

నమో.. సూర్యదేవా..


నమో.. సూర్యదేవా..
నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్‌ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌.
బ్రహ్మశాపంతో..
ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం ప్రకారం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు బాధ నుంచి విముక్తి కలిగించమని కలిగించమని అతను నవగ్రహాలను ప్రార్థించాడు. దీంతో అనుగ్రహించిన గ్రహాధిపతులు అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించారు.
దీనిపై సృష్టికర్త బ్రహ్మ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీప్రాంతానికి వెళ్లిపొమ్మని శాపం పెడుతాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారకుడైన పరమేశ్వరుని కోసం తపస్సు ఆచరిస్తాయి. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి కలిగిస్తాడు. వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదించాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటూ ప్రార్థిస్తే వారికి బాధలు ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఆ మహేశ్వరుడు.
ఉషా, ప్రత్యూషలతో కలిసి...
ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు సతీమణులైన ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తుంటారు. సూర్యదేవుడంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. అయితే అందుకు భిన్నంగా స్వామి మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో వుంటాడు. స్వామి వివాహవేడుకల్లో వుండటం విశేషం. మిగతా గ్రహాలకు కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలు వున్నాయి. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరముంది. నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం.
ఆలయ నిర్మాణం
క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివకామి, వినాయక, మురుగన్‌ విగ్రహాలున్నాయి. వీటితో పాటు ప్రధాన మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం వుంది. ప్రాంగణంలోనే ఇతర ఏడు గ్రహాధిపతులకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి.
ఉత్సవాలు
తమిళమాసమైన తాయ్‌ నెలలో జరిగే రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. తాయ్‌ మాసం (జనవరి-ఫిబ్రవరి)లో ఈ వేడుక జరుగుతుంది. సూర్యదేవుని రథం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు తిరుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో రథ సప్తమి వేడుకలను వైభవంగా పదిరోజుల పాటు జరుపుతారు. అలాగే ప్రతి తమిళమాసం ప్రారంభంలో ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. మహాభిషేకానికి విశేషసంఖ్యలో భక్తులు హాజరవుతారు.
గ్రహశాంతికి ప్రత్యేక పూజలు
గ్రహబాధల నుంచి విముక్తి పొందడానికి వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా వున్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి పూజలు సాంత్వన కలిగించమని వేడుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన... తదితర పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం... తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి ఇస్తుంటారు. చక్కెర పొంగలి ప్రసాదాన్ని కూడా పూజలో భాగంగా పంపిణీ చేస్తారు.
ఎలా చేరుకోవాలి
* రైలులో వచ్చే ప్రయాణికులు కుంభకోణం రైల్వేస్టేషన్‌లో దిగాలి. అక్కడ నుంచి ఆలయం 15 కి.మీ.దూరంలో వుంది. ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లవచ్చు.
* సమీప విమానాశ్రయం తిరుచినాపల్లిలో వుంది. విమానం దిగిన ప్రయాణికులు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్లవచ్చు. ( దూరం 110 కి.మీ.)
* వసతి సౌకర్యాలు: కుంభకోణంలోనే ఎక్కువ వసతి గృహాలున్నాయి.

శివ నామావళి

శివ నామావళి

శంభో శంకర సదా శివా

సర్వేశ్వరా మాం పాహి ప్రభో

పాహిప్రభో మాం పాహి విభో

లింగోద్ భవకరా లింగేశ్వరా

జగదీశ్వరా మాం పాహిప్రభో 1

చంద్రశేఖర చంద్రశేఖర

చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర చంద్రశేఖర

చంద్రశేఖర రక్స్హమాం 2

శివాయ పరమేస్వరాయ శశిశేఖరాయ నమ ఓం

భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమఓం

గౌరీశ్వరాయ నమఓం పరమేశ్వరాయ నమ ఓం 3

జయ జయ శంకర జయ అభయంకర

పార్వతి శంకర శంభో శంకర

సృస్హ్టి స్తితిలయ కారణ కారణ

మృత్యుంజయ గణ నాయకా

ఉమాపతే శివ శంకర శంకర

గంగాధరా జగదీశ్వర ఈశ్వర 4 (జయ జయ )

చంద్రశేఖరాయ నమఓం గంగాధరాయ నమఓం

ఓం నమశివాయ నమఓం హర హర హరాయ నమఓం

శివ శివ శివాయ నమఓం సర్వేస్వరాయ నమఓం

శివ శివ శివాయ నమఓం జగదీశ్వరాయ నమఓం 5

పోలో నాద ఉమాపతే శంభో శంకర పశుపతే

నంది వాహనా నాగ భూస్హణా

చంద్ర శేఖరా జడాధరా

గంగాధరా హర గౌరీ మనోహరా

గిరిజా కాంతా సదాశివా (బోలో నాదా)

కైలాసవాసా కనక సభేశా

గౌరి మనోహర విశ్వేశా

స్మశానవాసా చిదంబరేశా

నీలకంఠ మహదేవా (బోలో నాదా) 6

శివాయ నమ శివ లింగాయ నమ్ ఓం

భవాయ నమ భవ లింగాయ నమ్ ఓం

సర్వాయ నమ సర్వ లింగాయ నమ్ ఓం

రుద్రాయ నమ రుద్ర లింగాయ నమ్ ఓం

ఆత్మాయ నమ ఆత్మ లింగాయ నమ్ ఓం 7

మృత్యుంజయాయ నమ్ ఓం

త్రయంబకాయ నమ్ ఓం

లింగేశ్వరాయ నమ్ ఓం

సర్వేశ్వరాయ నమ్ ఓం

ఓంనమ శివాయ నమ్ ఓం

ఓం నమశివాయ నమ్ ఓం 8

హే ఇందుశేఖరా రాజా శివ రాజా

హే ఇందుశేఖరా శంభో శివ రాజా

హే హర హర శివ శివ పినాకవైభవ

రాజా శంకర శివ రాజా 9

నమ పార్వతి పతయే శంభో

హర హర హర హర మహాదేవా

హర హర హర హర మహదేవా

శివ శివ శివ శివసదాశివా

మహా దేవా మహా దేవా

దేవా శివా సాంభ సదాశివా (నమ పార్వతి) 10

నటరాజా నటరాజా నర్తన సుందర నటరాజా

శివరాజా శివరాజా శివకామిప్రియ శివరాజా

చిదంబరేశా నటరాజా చిత్సభేశా శివరాజా (నటరాజా) 11

కాల కాల కామ దహన కాశినాద పాహిమాం

విశాలాక్స్హి అంబశక్తి విశ్వనాధ రక్స్హమాం

డంభో శంకర గౌరీశా శివ

శంభో శంకర గౌరీశా

సామ గానప్రియ గౌరీశా శివ

సాంభ శంకరా గౌరీశా (కాల కాల )

ఉమా మహేశ్వర గౌరీశా శివ

ఊర్ధవ తాండ గౌరీశా

విశ్వనాధ ప్రభు గౌరీశా శివ

సాంబ శంకర గౌరీశా (కాల కాల)12

అసంభోమహదేవ చంద్రచూడ

శంకర సాంబ సదా శివ

గంగాధరా కైలాస వాసా

పాహిమాం పార్వతి రమణా (శంభో) 13

హర హర శంకర సాంబ సదాశివ ఉ ఈశా మహేశా

తాండవ ప్రియహర చంద్ర కలాధర ఈశా మహేశా

అంబా సుత లంభోదర వందిత ఈశా మహేశా

తుంగ హిమాచల శృంగ నివాసిత ఈశా మహేశా 14

భోలో భోలో సబ్మిల్ బోలో ఓం నమశివాయ

ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

జూట్టుజడా మేగాంగధారి త్రిశూలధారి డమరు బజాలో

డమడమడమ డమరు బజావో

కూంజ్ ఉడా ఓం నమశివాయ (బోలో...) 15

శంకర శంకర శంకరా

శంకర అభయంకర

పాహిమాం కృపాకరా

పాహిమాం పరమేశ్వరా

పాహిమాం కృపాకరా

పాహిమాం జగదీశ్వరా (శంకర..) 16

జయ జయ జయ శంకర హర హర హర శంకర

దేవ మనోహర హే పరమేశ్వర

పార్వతి నాయక పాహి శంకర (జయ జయ )

నందివాహన నాగభూస్హణా

దేవ మనోహర హే పరమేశ్వర

పార్వతి నాయక హే పరమేశ్వర (జయ జయ) 17

హే శివ శంకర నమామి శంకర

శివ శంకర శంభో

హే గిరిజాపతి భవానీ శంకర

శివ శంకర సంభో

శివ శంకర సంభో (హే శివ) 18

గోవింద నామావళి

గోవింద నామావళి

శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శ్రీవారి ఆలయంలోని మూలమూర్తి శిలా విగ్రహం

శ్రీవారి ఆలయంలోని మూలమూర్తి శిలా విగ్రహం


తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం. అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా, అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే. అంటే పూజానైవేద్యం కైంకర్యాలన్నీ ధ్రువ బేరానికే. ధ్రువబేరం అంటే మూలమూర్తి - శిలా విగ్రహం. ఎవరూ ప్రతిష్టించింది కాదు - పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ. ఈ విగ్రహం గురించి మొదట శంఖరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని, తర్వాత కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెల్పి తొండమానుని సాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలోనుండి తీయించి ఆలయం కట్టించమన్నాడనీ., పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండుగోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడుండేవాడనీ.

యోగులకు, దేవతలకు తపస్సంపన్నులకే కన్పడేవాడనీ. అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుని అర్చామూర్తిగా కలియుగాంతం వరకూ ఇక్కడ ఉండి, పాపులను ఉద్ధరించి వారి పాపాలు నాశనం చేసి, లోకాలను రక్షించమని కోరాడనీ. బ్రహ్మ ప్రార్థన మన్నించి స్వామి అర్చామూర్తిగా శ్రీవేంకటాచలంపై ఉన్నాడనీ పురాణాలలో ఉంది.
ప్రస్తుత తిరుమల వేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం. వైఖానస, పాంచరాత్ర, శైవ శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి? నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి? కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి? శయనమూర్తి ఎలా ఉండాలి? విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి? అవతార రూపాలు ఎలా ఉండాలి? వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది.
కాని శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన ఏ విగ్రహం లాగానూ లేదు. అంటే ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుండి వుందని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కనుక, తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకూ వైఖానస పూజావిధానమే కొనసాగుతోంది. శ్రీనివాసుని కుడి వక్షఃస్థలంలో శ్రీదేవి ఉంది. నాలుగు చేతులలో, రెండు పైకెత్తినట్లు (ఆయుధాలు పట్టుకోవడానికన్నట్లు) ఉంటే మూడవది వరదహస్తం, నాలుగవది కటి హస్తం. అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం. అలా ఆశ్రయించిన వారికి, ఈ సంసారసాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం. మరి ఈ మూర్తికి ధనుస్సు ఏదీ? శిలప్పదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ - భుజాల దగ్గర అమ్ములపొది, ధనుస్సు ఎల్లప్పుడూ ధరిస్తూండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికున్నాయని చెప్పబడింది. పురాణకాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు అయిదూ ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ ధనుస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి.
ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుండి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్రపుష్పములు అన్నిటిలో విష్ణుపరంగానే కాక అవతారరూపాలలో రామ, కృష్ణావతార విశేష ఘటనాప్రశస్తి చాలా ఉంది. ఇది రామావతారానికి, కృష్ణావతారానికి, ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం. ఈ ధ్రువబేరం (మూలవిగ్రహానికి) మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణకాలంలో శ్రీనివాసుని వివాహసమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహూకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కాని ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహ రాయలు చేయిస్తే, రెండవది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం. చివరిగా బలిబేరం. విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి. ప్రతిరోజూ స్నపన మండపంలో రాత్రి ఏకాంతసేవ - అంటే పవ్వళింపు సేవ జరిగేది భోగశ్రీనివాసునికే. బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి, అన్నమయ్య వంశం వారు లాలి పాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి ఇస్తూండగా స్వామివారు శయనిస్తారు.

కీర పండరీపురము

పాండురంగడు ప్రత్యక్షమైన కీర పండరీపురము

భక్తులను అనుగ్రహించి వారికోసం ప్రత్యక్షమైన దేవుళ్ళగురించి పురాణాల్లో చదివాముగానీ, కలియుగంలో భక్తునికోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలమా. చిలకలపూడిలోని కీర పండరీపురం చరిత్ర చదివాక నమ్మక తప్పదండీ. చిలకలపూడి అనగానే చాలామంది మహిళామణులకు చిలకలపూడి బంగారం నగలు, అవేనండీ రోల్డుగోల్డు నగలు గుర్తుకొస్తాయి. ఈ రోజుల్లో అవికూడా ప్రియమయిపోతున్నాయిగానీ అంతకన్నా ప్రియమైంది చిలకలపూడిలో మరొకటి వున్నది. అదే పాండురంగడు స్వయంగా సాక్షాత్కరించిన కీర పండరీపురము. మచిలీపట్నం శివార్లల్లోవున్న చిలకలపూడిలో వున్న ఈ క్షేత్రానికి కీర పండరీపురం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. పూర్వం ఇక్కడ దోస వ్రతం చేసేవారుట. అంటే దోస విత్తులు నాటి, అవి పెరిగి కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి, భగవంతునికి సమర్పించటం.

అందుకనే కీర పండరీపురం అనే పేరు వచ్చి వుండవచ్చునని కొందరి అభిప్రాయం. ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన భక్త నరసింహమే అంతకుముందు కాకి బంగారంతో నగలు చెయ్యటంకూడా కనిపెట్టారని అంటారు.
1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖ పట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులకు జన్మించారు సరసింహంగారు. ఈయనకి చిన్నతనంనుంచే దైవ భక్తి చాలా ఎక్కువ. తన 18 వ సంవత్సరంలో చిలకలపూడి వచ్చిన నరసింహంగారు అక్కడే వ్యాపారం చెయ్యటం మొదలుపెట్టి, కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. క్రమంగా ఆయన మనసు దైవభక్తివైపు అధిక మొగ్గు చూపించి, పాండురంగ విఠలుని వైపు మళ్ళింది. నరసింహంగారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహరాజ్ అనే గురువుగారి దర్శనమయింది. ఆయన నరసింహంగారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠ్ఠల మహామంత్ర రాజమునుకూడా ఉపదేశించి భక్త నరసింహం అనే పేరు పెట్టారు.

గురువుగారి ఆశీర్వచనముతో భక్త నరసింహం తన మనసులోని కోరిక, ఆలయ నిర్మాణమును తలపెట్టారు. శంఖుస్ధాపనకోసం పండరీపురములోని చంద్రభాగానదిలోని కొన్ని గులక రాళ్ళను ఉపయోగించ సంకల్పించారు. కానీ చంద్రభాగానది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ, ఈతగాళ్ళుకూడా నదినుండి రాళ్ళు తియ్యలేని పరిస్ధితిగా వున్నది. అప్పుడు నరసింహంగారు చంద్రభాగను ప్రార్ధించగా పుండరీక దేవాలయము పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది.
నరసింహంగారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నింటినీ పాండురంగని ముందుంచి, నరసింహంగారు, వారి గురువుగారు ప్రార్ధనా తన్మయత్వంలో వుండగా పాండురంగనినుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుధ్ధ ఏకాదశి బుధవారం (13-11-1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహంగారు సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహరాజ్ గారికి పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీశిష్యునికోసం తాను తెలిపిన రోజున కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖద్వారా నరసింహంగారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళంవేసి సీలు చేశారు. క్షణాలు గడుస్తన్నకొద్దీ నరసింహంగారికి ఆందోళన ప్రారంభంమయింది. ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్ధిస్తూ తన్మయావస్తలో వుండగా ఆంజనేయుడు ఆయనకి ఆభయమిచ్చాడుట.. పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్ధాపిస్తానని .
పగలు పదిన్నర అయింది. దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికెంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహంగారు అనేక ప్రార్ధనలు చేయగా తలుపులు తెరువబడి దివ్య తేజస్సులమధ్య పాండురంగని విగ్రహ సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురములోని పాండురంగని విగ్రహమువలెనున్నది. అక్కడలాగానే భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు.
తదుపరి భక్త నరసింహంగారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలబెట్టగా భారతావనిలో అనేకమంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును వ్రాశారు. ఆ పుస్తకములన్నియు తగు పూజావిధానముతో ఆలయప్రాంగణములోని విఠల్ కోటి స్ధూపములో నిక్షిప్తంగావించబడ్డాయి.

శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహంగారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. ప్రక్కనే వేరొక ఆలయంలో సహస్ర లింగ కైలాస మంటపము విరాజిల్లుతుంటే ఇంకొకపక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయము నిర్మింపబడ్డది. ఆరు ఎకరాల స్ధలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు..వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం..దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వధ్ధ వృక్షము, దానికింద చిన్న సిధ్ధేశ్వరాలయము. 400 ఏళ్ళ పైనుంచి వున్న ఈ అశ్వధ్ధ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలంనుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ వున్నారనీ, భక్త నరసింహంగారికి ఆయన దర్శనమిచ్చారనీ అంటారు.
భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసిహంగారు 16-1-1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరంనుంచి విద్యుత్కాంతిలాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటం, సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు.
దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ వుంచమన్నారు. ఆవిధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.
ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు. శ్రీ నరసింహంగారి మనుమలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.
సముద్ర తీరంలో వున్న ఈ ఆలయానికి, ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రంనుంచే కాక ఒరిస్సానుంచికూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహంగారి సంతతివారిచేతే నిర్వహించబడుతున్నది. కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడకి 82 కి.మీ. ల దూరంలో వున్నది.

Saturday, June 18, 2016

శ్రీవేంకటేశ్వర స్వామి వైభవం

శ్రీవేంకటేశ్వర స్వామి వైభవం

* ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం ....
* శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎందుకు ఉంటుంది ..??
* మహ అద్భుతమైన శ్రీవేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ .....
* శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడాని గల కారణం ..??

పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు.
వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి |
వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది.
అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.
ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు.
అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
శ్రీవారి వజ్రం ....
శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. లక్ష కోట్లు.
రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట....!
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా? స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము.
తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.
శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.
అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.
ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించేపీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.
తిరుమల సుప్రభాత సేవ :......
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రతిదినం 'సుప్రభాతం' అనబడే 'మేలుకొలుపు' సేవ తో ఆ రోజు నిర్వహించబోయే పూజా కార్యక్రమం ప్రారంభమై బంగారు వాకిలి ద్వారములు తెరుస్తారు.
తిరుమల లో ప్రతిరోజు నేటికి ప్రప్రధమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ఆదిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చే మొదటి దర్శన భాగ్యాన్ని వరం గా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతం లో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గొవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాఢావీధి లో ని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు.
శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను(12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం(నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు.
ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను 'వైకుంఠం క్యూ' ద్వార ఆలయం లోనికి అనుమతిస్తారు. వీరంతా బంగారువాకిలి ముందు దక్షిణం వైపు పురుషులు - ఉత్తరం వైపు స్త్రీలు వరుసగా నిలిచి వుంటారు.
ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారి కి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారి ని విశ్వరూప దర్శనం చేసుకుంటారు. సుప్రభాత సేవ ఆర్జిత సేవ అనగా నిర్ణీత రుసుము చెల్లించి భక్తులు సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవ కు రుసుము రూ.120-00. సుమారు 1 సంవత్సరం ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్కోవచ్చు. సిఫార్సు లేఖల ద్వార ఒక రోజు ముందుగా కూడా ఈ సేవ టికెట్లు పొందవచ్చు. ఈ సిఫార్సు లేఖలను తిరుమల జే.ఈ.ఓ వారి క్యాంపు కార్యాలయంలో సమర్పించి టిక్కెట్లు పొందవచ్చు. ఈ విధంగా ఖరీదు చేసే టిక్కెట్టు వెల 240-00 వుంటుంది. సంవత్సరంలో ఒక్క మార్గశిర (డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు) మాసంలో మాత్రం ఈ సేవను నిర్వహించరు. సుప్రభాతం స్థానంలో ధనుర్మాసం 30 రోజుల పాటు 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు.

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. కాబట్టి వారి దివ్యమైన క్రీడా జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడా శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మొహితుడు కాలేదన్నమాట. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకీ కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.

ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. అసలు కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇపుడు శివతేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చినవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఇపుడు ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. కాబట్టి ఈశ్వరా మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పదకుండు గాక! కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించదానికి భూమి అంగీకరించింది. అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అంది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతెజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. కాబట్టి గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు. అపుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. అపుడు ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వదానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములనుఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.

ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనే ‘గుహా’ అనే పేరు ఉంది. కాబట్టి పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు.

కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు

 కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు

'వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి'
బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.
తిరుమల పుణ్యక్షేత్రం 'కలియుగ వైకుంఠ'మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి 'ఆనంద నిలయ'మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.
స్థలపురాణం
కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి 'కల్యాణకట్ట' వద్దనే తలనీలాలు సమర్పించాలి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్‌, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
తితిదే ప్రకటించిన వేళల వివరాలివీ:
వారం
సమయం
ఆదివారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
సోమవారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
మంగళవారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 7 గం. వరకు
బుధవారం
ఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
గురువారం
ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శుక్రవారం
ఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శనివారం
ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు
వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు:శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్‌ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది.
తిరుపతి-తిరుమలకు ప్రయాణ సదుపాయాలు
తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకునే భక్తులకు స్టేషన్‌ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు తిరుమల నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుతుంది. తిరిగి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు బయల్దేరుతుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్‌ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు తితిదే అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న అనంతరం టోల్‌ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకునితితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు తితిదే బార్‌ కోడింగ్‌ రశీదులను జారీ చేస్తుంది.
కాలినడకన వెళ్లే భక్తుల కోసం
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద ఇవ్వడాన్ని రద్దు చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద నిత్యం అంతర్జాలంలో 6వేలు, ఇ-దర్శన కౌంటర్ల ద్వారా మరో 5వలే టికెట్లను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లలో నిర్దేశించిన సమయానికి ఆయా భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులు ధరించని పక్షంలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. ఒక్కో టికెట్‌పై రెండు ప్రసాద లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.
తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
వసతి సౌకర్యం
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతి-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్‌లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్‌ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది.
ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్‌లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు తితిదే కార్యాలయంలో సంప్రదించాలి
ఆర్జితసేవ పేరు
హాజరు కావాల్సిన సమయం
సుప్రభాతం
ఉదయం 2 గంటలకు
వస్త్రాలంకరణ సేవ
ఉదయం 3 గంటలకు
అభిషేకం
ఉదయం 3 గంటలకు
తోమాల
ఉదయం 3గంటలకు
అర్చన
ఉదయం 4గంటలకు
నిజపాద దర్శనం
ఉదయం 4.30గంటలకు
అష్టదళ పాద పద్మారాధన సేవ
ఉదయం 5 గంటలకు
సహస్ర కలశాభిషేకం
ఉదయం 5గంటలకు
తిరుప్పావడ సేవ
ఉదయం 5గంటలకు
విశేషపూజ
ఉదయం 6గంటలకు
కల్యాణోత్సవం
ఉదయం 10గంటలకు
వూంజలసేవ
ఉదయం 11గంటలకు
ఆర్జిత బ్రహ్మోత్సవం
మధ్యాహ్నం 1.30గంటలకు
వసంతోత్సవం
మధ్యాహ్నం 2గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవ
సాయంత్రం 5గంటలకు
ప్రధాన/ ప్రత్యేక పూజలు:
నిత్యసేవలు: సుప్రభాతం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 120
నిత్యసేవలు: తోమాల
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: అర్చన
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: కల్యాణోత్సవం
ప్రవేశం: ఇద్దరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 1000
నిత్యసేవలు: ఆర్జిత బ్రహ్మోత్సవం
ప్రవేశం: ఒకరికి రోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: డోలోత్సవం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: సహస్ర దీపాలంకరణ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వారం సేవలు విశేషపూజ
ప్రవేశం: ఒకరికిరోజు: సోమవారంటిక్కెట్టు ధర: రూ.600
నిత్యసేవలు: అష్టదళ పాదపద్మారాధనం
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళవారం టిక్కెట్టు ధర: రూ. 1,250నిత్యసేవలు: సహస్ర కలశాభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: బుధవారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: తిరుప్పావడ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: గురువారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: అభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.750
నిత్యసేవలు: నిజపాద దర్శనం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వస్త్రాలంకరణ సేవ
ప్రవేశం: ఇద్దరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ. 12,250