శంభో మహాదేవ! శంభో మహాదేవ! స్వాంతమ్మునందు పూజింతు నిన్ను
శంభో మహాదేవ! శంభో మహాదేవ! పాలింపుమా మమ్ము పార్వతీశ!
దేవదేవా! మహాదేవ! గౌరీనాథ! ధ్యానింతు నీదు తత్వమ్ము నాత్మ
దేవదేవా! వామదేవ! విశ్వేశ్వరా! ఆవాహనమ్మిదే! ఆదిదేవ!
దేవదేవా! సర్వదేవబృందార్చితా! నవరత్నఖచితాసనమిదె నీకు
దేవదేవా! దయాభావ! మృత్యంజయా! పాద్యజల మ్మిదే పరమపురుష!
శివశివా! శశధరశేఖరా! పరమేశ! అర్ఘ్య మియ్యదె నీకు అమృతరూప!
శివశివా! కైలాసశృంగనికేతనా! ఆచమనీయ మియ్యదె మహేశ!
శివశివా! భూతేశ! శ్రీకంఠ! పావనగంగాజలాభిషేక మిదె నీకు
శివశివా! సద్భక్తచిత్తాబ్జమందిరా! రమణీయవస్త్రయుగ్మ మిదె నీకు
భవభవా! శ్రితజనపాపవినాశకా! యజ్ఞసూత్ర మ్మిదే అభవ నీకు
భవభవా! సూర్యేందువహ్నిత్రిలోచనా! శ్రీచందనమ్ము నర్పింతు నీకు
భవభవా! ప్రజ్ఞానవైరాగ్యవైభవా! భూషణ మ్మిదె నీకు భూరితేజ
భవభవా! చిద్రూప! బ్రహ్మాండనాయకా! పుష్పాళితో నీకు పూజ లివియె
హరహరా! భవహరా! అభయప్రదాయకా! ధూపమియ్యదె నీకు దుఃఖనాశ!
హరహరా! శుభకరా! ఆర్యాసమన్వితా! దీపరాజియ్యదే దివ్యగాత్ర!
హరహరా! సకలలోకాధార! బహువిధ నైవేద్య మిదె నీకు నందివాహ!
హరహరా! పంచబాణాంతకా! కర్పూరతాంబూల మిదె నీకు నంబికేశ!
మంగళమ్మో సర్వమంగళాధవ నీకు మంగళ హారతి లింగరూప!
మంత్రవాచ్యా! నీకు మానసపూజతో మంత్రపుష్పమ్మిదే మద్ధృదీశ!
శంభో మహాదేవ! శంభో మహాదేవ! స్వాంతమ్మునందు పూజింతు నిన్ను
శంభో మహాదేవ! శంభో మహాదేవ! పాలింపుమా మమ్ము పార్వతీశ!!
పార్వతీశు కరుణ బడసి వ్రాసిన యట్టి
యీ స్తవమును నిత్య మెవ్వరేని
బూని మానసమున పూజింప నొదవును శాంతి సౌఖ్యములును సద్గతులును..
No comments:
Post a Comment